రాజమౌళి దర్శకత్వంలో నటిస్తా

''విశ్వరూపం' వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. కమల్‌హాసన్‌కి నేను వీరాభిమానిని. అంత పెద్ద నటుడు కంటతడి పెట్టడం చాలా బాధనిపించింద''న్నారు ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు. ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో మహేష్‌ విలేకరులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ''కమల్‌హాసన్‌ నటించిన 'విశ్వరూపం' చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. ఆ సినిమాకి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకొంటున్నాన''న్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి చెబుతూ ''సహజత్వంతో కూడిన కథ ఇది. యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ ఇదివరకు చేసిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ''శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రిష్‌, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్‌ల దర్శకత్వంలో సినిమాలు చేస్తా. అవి పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కథ గురించి ఇదివరకే మాట్లాడుకొన్నామ''ని తెలిపారు. మీ అమ్మాయి సితార ఎలా ఉంది? అన్న ప్రశ్నకు బదులిస్తూ... ''పాప వయసు ఆరు నెలలు. అందరినీ చూసి ముద్దుముద్దుగా నవ్వుతోంద''ని చెప్పారు.

నెంబర్‌వన్ ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయించాలి!

‘సీతమ్మ వాకిట్లో...’ చిత్రాన్ని మల్టీస్టారర్ అంటే ఒప్పుకోను. మంచి సినిమా అది. వాణిజ్య సూత్రాల ప్రకారం మల్టీస్టారర్ అంటే ఇద్దరు హీరోలకు రెండేసి ఫైట్స్, రెండు ఐటమ్‌సాంగ్‌లు వుంటాయి. అవేవీ ఈ సినిమాలో లేవు. కథలోని కుటుంబ విలువలు, హృదయానికి హత్తుకునే సున్నితమైన భావోద్వేగాలు నచ్చి ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా చేయడానికి అంగీకరించాను’ అన్నారు మహేష్‌బాబు. ‘దూకుడు’ ‘బిజినెస్‌మెన్’ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల ద్వారా వరుస విజయాలతో దూసుకుపోతున్నారాయన. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చిత్రీకరణలో వున్నారు మహేష్‌బాబు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లో మహేష్‌బాబు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి... 

మీ చిత్రాల శైలికి భిన్నంగా ‘సీతమ్మ వాకిట్లో...’ చేశారు. సినిమా విజయం ఎలాంటి అనుభూతినిస్తోంది?
నా దృష్టిలో ‘సీతమ్మ వాకిట్లో...’ సున్నితమైన భావోద్వేగాలు మేళవించిన ఓ అర్థవంతమైన కుటుంబ కథా చిత్రం. వాణిజ్య విలువల్ని పక్కనబెట్టి కథను నమ్మి ఈ సినిమా చేశాను. చిత్రీకరణ మొదలుపెట్టిన దగ్గరినుంచి అందరూ ఆశావహ దృక్పథంతో సినిమా కోసం శ్రమించారు. ప్రేక్షకుల నుంచి అద్వితీయమైన ఆదరణ రావడం గొప్ప అనుభూతినిస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో...’తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్ చిత్రాలకు మరల బీజం వేసింది. చక్కటి కథాబలంతో మల్టీస్టారర్ చిత్రాల రూపకల్పనకు నాంది పలికింది.

‘దూకుడు’ ‘బిజినెస్‌మెన్’ ‘సీతమ్మవాకిట్లో...’ వరుస విజయాలతో సాగిపోతున్నారు? కథల ఎంపికలో మీ ధోరణిలో మార్పు వచ్చిందనుకోవచ్చా?
‘దూకుడు’ టైం నుంచి మంచి కథలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు పరిక్షిశమలో కథల కొరత వుంది. గత మూడు చిత్రాల విజయానికి కథాబలమే ప్రధానంగా పనిచేసింది.

సీనియర్ హీరోలతో కాకుండా మీ సమకాలీన స్టార్‌హీరోలతో కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించే ఆలోచన వుందా?
నా సమకాలీనులతో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే అందుకు మంచి కథ అవసరం. సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడు కావాలి. అలా అన్ని అంశాలు కుదిరితే యంగ్‌హీరోలతో కూడా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తాను.

మీరింత వరకు రీమేక్ సినిమాల్లో నటించకపోవడానికి కారణమేమిటి?
రీమేక్ సినిమాల్లో నటించడం నాకిష్టముండదు. ఒరిజినల్ సినిమా చేసిన ఫీల్‌తో రీమేక్‌లో నటించలేం. అందరికీ తెలిసిన కథలో నటించాలంటే బోర్‌గా అనిపిస్తుంది. రీమేక్ చేయడంలో సృజనాత్మకత వుండదని నా అభిప్రాయం. చేసే కథ మనలో ఉత్సాహాన్ని నింపాలి. అప్పుడే దానికి న్యాయం చేయగలం.

‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా చూసి మీ తనయుడు గౌతమ్ ఏమన్నాడు? బాలనటుడిగా అతన్ని సినిమా రంగానికి పరిచయం చేసే ఆలోచన వుందా?
గౌతమ్ చూసిన మొదటి సినిమా ఇది. నాతో కలసి చూశాడు. వాడికి ఫైట్స్ అంటే నచ్చవు. సినిమా చూసి చాలా బాగుందన్నాడు. ఆ సినిమాతో వాడు బాగా కనెక్ట్ అయ్యాడు. సినిమా ఆడియో ఫంక్షన్‌కు రావడం కూడా వాడిలో తెలియని ఉత్సాహాన్ని నింపింది. ఇక గౌతమ్ వాడి అభిరుచిని బట్టి సినిమాల్లో నటించాలా? వద్దా? అని నిర్ణయించుకుంటాడు. బాలనటుడిగా నేనూ సినిమాలు చేశాను. అందులో నాన్న ప్రోద్భలం ఏమీ లేదు. నా ఆసక్తి మేరకే నటించాను. 

తమిళ హీరోలు తెలుగులో మార్కెట్‌ను పెంచుకుంటున్నారు? అదేస్థాయిలో తెలుగు హీరోలు తమిళంలో రాణించలేకపోవటానికి కారణమేమిటి?
కథాంశాల ఎంపికలో ప్రయోగాలు చేయాలి. భాషలకు అతీతంగా యూనివర్సల్ ఫీల్ వున్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు చేయాలి. అప్పుడు మన సినిమాల్ని ఏ భాషలోకైనా డబ్బింగ్ చేసుకోవచ్చు. తెలుగు సినిమా కథలు మన పరిధిని దాటి వెళ్లవు. ‘సీతమ్మ వాకిట్లో...’ యూనివర్సల్ ఫీల్ వున్న కథాంశం. ఇలాంటి సినిమాను ఏ భాషలోనైనా విడుదల చేసుకోవచ్చు.

వివిధ వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు నటుల్లో మీరే అగ్రస్థానంలో వున్నారు. ఆ సంస్థలు మీవైపే ఎక్కువగా మొగ్గుచూపడానికి కారణమేమిటని భావిస్తున్నారు?
‘ఖలేజా’ తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. అదే సమయంలో సినిమాలు చేయకుండా ఖాళీగా వున్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశాలు మాత్రం పెరిగిపోయాయి. బ్రాండ్ అంబాసిడర్‌నుఎంపికచేసుకునే ముందు ఆయా సంస్థలు చక్కటి ప్రమాణాలతో సర్వేలు చేస్తాయి.వాటి ఆధారంగానే ఎక్కువ ప్రజాదరణ వున్న సెలవూబిటీస్ ఎవరో తెలుసుకుంటారు. ఆ గణాంకాల్ని నేను తెలుసున్నాను. సినిమాలు చేయకున్నా ప్రేక్షకుల్లో నాకున్న ఆదరణ చూసి ఆశ్చర్యమేసింది. అప్పటి నుంచి నటుడిగా ప్రేక్షకులకు చేరువయ్యేందుకు మరింత కష్టపడటం మొదలుపెట్టాను.

ఓ మద్యం కంపెనీ ప్రకటనలో నటించారు. మీ స్థాయి నటులు అలాంటి వ్యాపార ప్రకటనల్లో నటించడం వల్ల అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు వుంటాయి కదా?
ఆ ప్రకటన కాన్సెప్ట్ నచ్చి చేశాను. యాడ్స్‌లో సృజనాత్మకత వుంటేనే నేను అంగీకరిస్తాను. అదీగాక నా వ్యక్తిగత అభిరుచుల్ని ప్రకటన సంతృప్తిపరచాలి. డబ్బులొస్తున్నాయి కదా అని అన్ని కంపెనీలకు పనిచేయను. ఆ మద్యం కంపెనీ ప్రకటనలో వున్న థీమ్ నచ్చింది. ఓ వ్యక్తి ఎదిగే క్రమాన్ని ఆ ప్రకటనలో అద్భుతంగా చూపించారు. వీటన్నంటితో పాటు ఆ ప్రకటనలో వున్న లైఫ్ ఆఫ్ మ్యూజిక్ నచ్చి అందులో నటించాను.

తెలుగు పరిక్షిశమలో మీరే నెం.1 కథానాయకుడు అంటున్నారు?
ఆ విషయాన్ని నేను అంగీకరించను. ఎవరు నెం.1? అన్న అంశాన్ని ప్రేక్షకులు నిర్ణయించాలి. ఒకవేళ ప్రేక్షకులు ‘నువ్వే నెం.1’ అని అంటే ఒప్పుకుంటాను.

‘విశ్వరూపం’ విడుదలలో ఎదురైన అవాంతరాలపై మీ స్పందన?
కమల్‌హాసన్ వీరాభిమానిని నేను. సినిమా విడుదలకు ఆయన ఎదుర్కొన్న కష్టాల్ని చూసి చలించిపోయాను. ఆయన ఆవేదన నాకు కన్నీళ్లు తెప్పించింది.

మీ నాన్నగారితో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు?
మంచి కథ వస్తే నాన్నగారితో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాను. ఆయన ఇక రాజకీయాల్లోకి వెళ్లనని చెప్పారు కానీ సినిమాల్లో మాత్రం నటిస్తానన్నారు.

ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చింది?
‘అల్లూరి సీతారామరాజు’. లెక్కలేనన్నిసార్లు ఆ సినిమా చూశాను. చిన్నతనంలో మొదటిసారి ఆ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘పాతాలభైరవి’ని ఇష్టపడతాను. నాన్న చేసిన మల్టీస్టారర్ చిత్రాల్లో ‘దేవుడు చేసిన మనుషులు’ నా ఫేవరేట్.

మణిరత్నంతో సినిమా చేస్తానన్నారు? ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది?
మణిరత్నం నా అభిమాన దర్శకుడు. ఆయన సినిమాలో నటించాలన్నది నా జీవితకాల స్వప్నం. ఆయనతో సినిమా చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటుంది? ఆ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి?
సుకుమార్ శైలిలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అది. నా పాత్ర చిత్రణ, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా వుంటాయి. టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. మీరన్న ‘ఆచార్య’ అన్న టైటిల్ వినగానే నా కాళ్లలో వణుకుమొదలైంది(నవ్వుతూ).

తదుపరి చిత్రాలు?
సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం పూర్తవగానే శ్రీనువైట్ల ‘ఆగడు’లో నటించబోతున్నాను. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘శివం’, ఆపై వంశీపైడిపల్లి, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలు చేయాల్సివుంది.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates