'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... వాడే పండుగాడు..' ఇలాంటి పదునైన మాటలు మహేష్‌బాబు నోటి నుంచి విని చాలాకాలం అయ్యింది. 'అతిథి' తర్వాత ఈ కథానాయకుడిని వెండి తెర మీద చూసే భాగ్యం అభిమానులకు ఇంకా కలగలేదు. ఆ లోటు తీర్చడానికి మహేష్- 'ఖలేజా' ఇప్పుడు శరవేగంగా రూపుదిద్దుకొంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌తో అనుష్క జోడీ కట్టింది. శింగనమల రమేష్, సి.కల్యాణ్ నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. ''మహేష్ పరిచయ సన్నివేశాల్లో వచ్చే గీతమిది. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్న ఈ గీతం మాస్‌ని ఆకట్టుకొంటుంది. మరోపాట చిత్రీకరించాల్సివుంది. త్రివిక్రమ్ శైలికి ఈ చిత్రం మరోసారి అద్దం పడుతుంది. మహేష్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు వాణిజ్య విలువలు పుష్కలంగా ఉన్నాయి. అనుష్క కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు. ఆమె పాత్ర కూడా కీలకం. మహేష్‌బాబు- ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయి. సెప్టెంబరు చివరికల్లా సినిమాని సిద్ధం చేస్తామ''న్నారు నిర్మాతలు. సంగీతం: మణిశర్మ