‘ఖలేజా’ ది బెస్ట్ - మహేష్‌బాబు

‘‘నేను ఊహించినదానికన్నా ఈ చిత్రానికి ఎక్కువ స్పందన లభించింది. చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నా అభిమానులు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు’’ అని మహేష్‌బాబు అంటున్నారు. ఆయన హీరోగా, అనుష్క హీరోయిన్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేష్, సి.కళ్యాణ్ కలిసి నిర్మించిన ‘మహేష్ ఖలేజా’ గత గురువారం విడుదలైన విషయం విదితమే. ఈ చిత్రం తాము ఊహించినట్లుగానే ప్రేక్షకాదరణ పొందిందని ఆదివారం ఏర్పాటు చేసిన ‘సక్సెస్ మీట్’లో మహేష్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సి.కళ్యాణ్ మాట్లాడుతూ - ‘‘పది సినిమాలకు చేసే నటనను మహేష్‌బాబు ఈ ఒక్క సినిమాకే చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా యూఎస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేయనంత చేస్తోంది ‘ఖలేజా’’’ అన్నారు.

‘‘మహేష్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’కి పూర్తి భిన్నంగా ఈ చిత్రంలోని పాత్ర ఉండాలనుకున్నాను. ‘అతడు’లో మహేష్ తక్కువ మాట్లాడతారు. ఇందులో అందుకు భిన్నంగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మేమందరం మా శక్తి మేరకు మంచి సినిమా ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేశాం, అది ఫలించింది’’అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్‌బాబు సమాధానాలు చెప్పారు. వాటిల్లో సంక్షిప్తంగా కొన్ని... ‘‘మొదటిసారి నేను చాలా ఓపెన్ అయ్యి యాక్ట్ చేసిన సినిమా ఇది. మాములుగా తక్కువగా మాట్లాడే నేను ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడాను. వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఈ చిత్రాన్ని నాన్నగారు చూసి అద్భుతంగా చేశావు, సినిమా బాగుంది అని అభినందించారు.

మా అబ్బాయి గౌతమ్ ఇంకా సినిమా చూడలేదు. కానీ, ఈ సినిమాలోని ‘సదా శివ..., కురిసే పెదవుల పైన.., ఇంకో పాట.. గౌతమ్ పూర్తిగా పాడతాడు. వాడు ఏ పాట అయినా ఇష్టంగా పాడాడంటే అది హిట్ కిందే లెక్క. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే.. ఈ రెండేళ్లల్లో మేమిద్దరం బాగా చర్చించుకుని ఈ సినిమా చేశాం. మా అబ్బాయి రోజూ సాయంత్రం జూబ్లీ హిల్స్ క్లబ్‌కి వెళ్లి ఆడుకుంటాడు. వాడు అలా వెళ్లగానే త్రివికమ్ మా ఇంటికొచ్చేసి నాతో ఆడుకునేవాడు (నవ్వుతూ).

నాకు నేనుగా చెప్పుకోకూడదు కానీ, ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చేయనంత అత్యద్భుతంగా నేను ఇందులో యాక్ట్ చేశా. ఈ చిత్రంలో నన్ను పాలి గ్రామస్తులు దేవుడిలా భావిస్తారు. ఆపదలో ఉన్నవారికి ఎవరైనా సహాయం చేస్తే ఆ వ్యక్తి దేవుడిలా కనిపిస్తాడనేది మా కాన్సెప్ట్. కథపరంగా హైదరాబాద్, రాజస్తాన్‌లలో నేను మామూలు టాక్సీ డ్రైవర్‌ని. కానీ పాలీ ప్రజలకు మాత్రం నేను దేవుడిలా కనిపిస్తాను. ఈ పాత్ర బాగా పండటం కోసం నా పరిధి దాటి యాక్ట్ చేశాను’’ అని చెప్పారు మహేష్‌బాబు.

రాజస్తాన్‌లో ఏం జరిగింది?

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఓ ఉపాధ్యాయుడి మనవడు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్ళిపోయే ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో రాజస్థాన్ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ఓ అందమైన భామ పరిచయం అవుతుంది..? ఇక ఆ తర్వాత ఆ యువకుడికి ఎదురైన పరిస్థితులేమిటి? వాటిని అతను ఎలా చక్కదిద్దాడు..? అనేది మిగతా కథాంశం. ఇది టూకీగా మహేష్ ‘ఖలేజా’ కథ.

మూడేళ్ళ విరామం తర్వాత ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క నాయికగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు, సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలో ఒకరైన సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. మహేష్ కెరీర్‌లో అన్ని విధాలుగా ఇది నంబర్‌వన్ సినిమా అవుతుంది.


ఆయన అభినయం చిత్రానికి మొదటి హైలైట్‌గా నిలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో ఎంతో స్టయిలిష్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ‘ఖలేజా’ అన్ని వర్గాల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ప్రకాష్‌రాజ్, డా.బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి.

'ఖలేజా' చూపించడానికి మహేష్‌ సిద్ధమయ్యారు

హేష్‌బాబు తెలుగు తెరపై కనిపించి మూడేళ్లయింది. తమ అభిమాన కథానాయకుని సినిమా ఎప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 'ఖలేజా' చూపించడానికి మహేష్‌ సిద్ధమయ్యారు. ఈ చిత్రం 7న విడుదలవుతోంది. దైవమ్‌ మానుష్య రూపేణా అనే సిద్ధాంతంతో త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహేష్‌ బాబు ట్యాక్సీ డ్రైవర్‌ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మహేష్‌ సరసన అనుష్క నటించింది. శింగనమల రమేష్‌, సి.కల్యాణ్‌లు నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''మహేష్‌, త్రివిక్రమ్‌ల కలయిక అనేసరికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటిని తప్పక అందుకొంటాం. ఇటీవలే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంద''న్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సునీల్‌, వేణుమాధవ్‌, అలీ, నాజర్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, షపీ, సునీల్‌ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: ఎస్‌.భట్‌, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌, కళ: ఆనంద్‌సాయి, సమర్పణ: ఎస్‌.సత్యరామ్మూర్తి.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates