రాజస్తాన్‌లో ఏం జరిగింది?

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఓ ఉపాధ్యాయుడి మనవడు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్ళిపోయే ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో రాజస్థాన్ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ఓ అందమైన భామ పరిచయం అవుతుంది..? ఇక ఆ తర్వాత ఆ యువకుడికి ఎదురైన పరిస్థితులేమిటి? వాటిని అతను ఎలా చక్కదిద్దాడు..? అనేది మిగతా కథాంశం. ఇది టూకీగా మహేష్ ‘ఖలేజా’ కథ.

మూడేళ్ళ విరామం తర్వాత ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క నాయికగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు, సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలో ఒకరైన సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. మహేష్ కెరీర్‌లో అన్ని విధాలుగా ఇది నంబర్‌వన్ సినిమా అవుతుంది.


ఆయన అభినయం చిత్రానికి మొదటి హైలైట్‌గా నిలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో ఎంతో స్టయిలిష్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ‘ఖలేజా’ అన్ని వర్గాల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ప్రకాష్‌రాజ్, డా.బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates