‘ఖలేజా’ ది బెస్ట్ - మహేష్‌బాబు

‘‘నేను ఊహించినదానికన్నా ఈ చిత్రానికి ఎక్కువ స్పందన లభించింది. చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నా అభిమానులు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు’’ అని మహేష్‌బాబు అంటున్నారు. ఆయన హీరోగా, అనుష్క హీరోయిన్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేష్, సి.కళ్యాణ్ కలిసి నిర్మించిన ‘మహేష్ ఖలేజా’ గత గురువారం విడుదలైన విషయం విదితమే. ఈ చిత్రం తాము ఊహించినట్లుగానే ప్రేక్షకాదరణ పొందిందని ఆదివారం ఏర్పాటు చేసిన ‘సక్సెస్ మీట్’లో మహేష్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సి.కళ్యాణ్ మాట్లాడుతూ - ‘‘పది సినిమాలకు చేసే నటనను మహేష్‌బాబు ఈ ఒక్క సినిమాకే చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా యూఎస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేయనంత చేస్తోంది ‘ఖలేజా’’’ అన్నారు.

‘‘మహేష్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’కి పూర్తి భిన్నంగా ఈ చిత్రంలోని పాత్ర ఉండాలనుకున్నాను. ‘అతడు’లో మహేష్ తక్కువ మాట్లాడతారు. ఇందులో అందుకు భిన్నంగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మేమందరం మా శక్తి మేరకు మంచి సినిమా ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేశాం, అది ఫలించింది’’అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్‌బాబు సమాధానాలు చెప్పారు. వాటిల్లో సంక్షిప్తంగా కొన్ని... ‘‘మొదటిసారి నేను చాలా ఓపెన్ అయ్యి యాక్ట్ చేసిన సినిమా ఇది. మాములుగా తక్కువగా మాట్లాడే నేను ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడాను. వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఈ చిత్రాన్ని నాన్నగారు చూసి అద్భుతంగా చేశావు, సినిమా బాగుంది అని అభినందించారు.

మా అబ్బాయి గౌతమ్ ఇంకా సినిమా చూడలేదు. కానీ, ఈ సినిమాలోని ‘సదా శివ..., కురిసే పెదవుల పైన.., ఇంకో పాట.. గౌతమ్ పూర్తిగా పాడతాడు. వాడు ఏ పాట అయినా ఇష్టంగా పాడాడంటే అది హిట్ కిందే లెక్క. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే.. ఈ రెండేళ్లల్లో మేమిద్దరం బాగా చర్చించుకుని ఈ సినిమా చేశాం. మా అబ్బాయి రోజూ సాయంత్రం జూబ్లీ హిల్స్ క్లబ్‌కి వెళ్లి ఆడుకుంటాడు. వాడు అలా వెళ్లగానే త్రివికమ్ మా ఇంటికొచ్చేసి నాతో ఆడుకునేవాడు (నవ్వుతూ).

నాకు నేనుగా చెప్పుకోకూడదు కానీ, ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చేయనంత అత్యద్భుతంగా నేను ఇందులో యాక్ట్ చేశా. ఈ చిత్రంలో నన్ను పాలి గ్రామస్తులు దేవుడిలా భావిస్తారు. ఆపదలో ఉన్నవారికి ఎవరైనా సహాయం చేస్తే ఆ వ్యక్తి దేవుడిలా కనిపిస్తాడనేది మా కాన్సెప్ట్. కథపరంగా హైదరాబాద్, రాజస్తాన్‌లలో నేను మామూలు టాక్సీ డ్రైవర్‌ని. కానీ పాలీ ప్రజలకు మాత్రం నేను దేవుడిలా కనిపిస్తాను. ఈ పాత్ర బాగా పండటం కోసం నా పరిధి దాటి యాక్ట్ చేశాను’’ అని చెప్పారు మహేష్‌బాబు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates