మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అతడు తర్వాత చేస్తోన్న మరో భారీ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.

ఎస్. సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ "ప్రొడక్షన్ నెం.2" చిత్రంలో మహేష్ బాబు సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ అతడు హిట్ తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కొత్త సబ్జెక్ట్ తనకు ఎంతో బాగా నచ్చిందని, కథ విని సంతృప్తి చెందడం వల్లే ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేస్తున్నానని పేర్కొన్నారు.

ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను అలరించే అన్ని అంశాలతో, అత్యున్నత ప్రమాణాలతో రూపొందనుందని మహేష్ బాబు తెలిపారు. హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న తొలి చిత్రమిదని చెప్పారు. సబ్జెక్ట్ చాలా ఆసక్తికరంగా ఉందని, త్రివిక్రమ్ దర్శకత్వంలో పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు.

నిర్మాత శింగనమల రమేష్ బాబు మాట్లాడుతూ మహేష్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సెన్సేషనల్ హిట్ తీయాలన్న అభిప్రాయంతో ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. జూన్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్తో సగం సినిమా పూర్తవుతుందని ఈ సందర్భంగా రమేష్ బాబు తెలిపారు.

హైదరాబాద్‌లో చిత్రీకరించనున్న ఈ షెడ్యూల్ కోసం గండిపేట దగ్గర రెండు కోట్ల రూపాయల వ్యయంతో విలేజ్‌ సెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు ఈ చిత్రం కోసం అత్యంత భారీ వ్యయంతో రాజస్థాన్ టెంపుల్ సెట్ వేస్తున్నామని తెలపారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందే ఈ సినిమా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని నమీబియా, రాజస్థాన్‌, ఇటలీలలోను పాటలు చిత్రీకరించడం ద్వారా దాదాపుగా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత వివరించారు.

పోకిరితో రికార్డులు బ్రద్దలు కొట్టిన మహేష్ బాబు, అరుంధతితో రికార్డులు సృష్టించిన అనుష్క, జల్సాతో రికార్డులు కొట్టేసిన త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తమ కనకరత్న మూవీస్ బేనర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో ప్రకాష్ రాజ్ బ్రహ్మానంద్, సునీల్, వేణుమాధవ్, ఆలీ, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, షఫీ, సుశీల్ శర్మ, సుధ, శ్రీ రంజని తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం- మణిశర్మ, ఫోటోగ్రఫీ- సునీల్ పటేల్, ఫైట్స్- విజయన్, ఎడిటింగ్- శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్- ఆనంద్‌ సాయి, స్టిల్స్- దాస్, కో-డైరక్టర్స్- జాస్తి హేమాంబర్, రవికిరణ్, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూసర్- బి. బుల్లి సుబ్బారావు, సమర్పణ- ఎస్. సత్యరామమూర్తి.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates