రాజమౌళి దర్శకత్వంలో నటిస్తా

''విశ్వరూపం' వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. కమల్‌హాసన్‌కి నేను వీరాభిమానిని. అంత పెద్ద నటుడు కంటతడి పెట్టడం చాలా బాధనిపించింద''న్నారు ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు. ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో మహేష్‌ విలేకరులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ''కమల్‌హాసన్‌ నటించిన 'విశ్వరూపం' చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. ఆ సినిమాకి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకొంటున్నాన''న్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి చెబుతూ ''సహజత్వంతో కూడిన కథ ఇది. యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ ఇదివరకు చేసిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ''శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రిష్‌, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్‌ల దర్శకత్వంలో సినిమాలు చేస్తా. అవి పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కథ గురించి ఇదివరకే మాట్లాడుకొన్నామ''ని తెలిపారు. మీ అమ్మాయి సితార ఎలా ఉంది? అన్న ప్రశ్నకు బదులిస్తూ... ''పాప వయసు ఆరు నెలలు. అందరినీ చూసి ముద్దుముద్దుగా నవ్వుతోంద''ని చెప్పారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates