అక్టోబరు 7న ఖలేజా


అక్టోబర్ 7... సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులకు పండగ రోజే అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజునే ‘మహేష్ ఖలేజా’ చిత్రం విడుదల కానుంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రిన్స్ బాక్సాఫీస్ వద్ద తన ‘ఖలేజా’ చూపించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ గతంలో చేసిన ‘అతడు’ ఆయన కెరీర్‌లోనే అందరి మన్ననలు అందుకున్న చిత్రంగా నిలిచింది. ఆ చిత్రాన్ని అధిగమించే స్థాయిలో ‘ఖలేజా’ ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన సింగనమల రమేష్‌బాబు అంటున్నారు.

అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి మరో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ -‘‘బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా, రెవిన్యూ పరంగా, పెర్‌ఫార్మెన్స్ పరంగా... ‘మహేష్ ఖలేజా’ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. ఇది నమ్మకంతో చెబుతున్న మాట. మహేష్ తప్ప ఎవరూ ఈ పాత్రను ఆ స్థాయిలో పోషించలేరు అనిపించే స్థాయిలో ఇందులో ఆయన నటన సాగింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం అందరి అంచనాలనూ అందుకుంటుందని నమ్మకంతో ఉన్నాం. మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం ఇచ్చారు.

ఇప్పటివరకూ మహేష్-మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆడియోలన్నింటికంటే బెటర్‌గా ఈ చిత్రానికి మణిశర్మ పాటలు అందించారు. ఈ నెల 27న పాటలను, అక్టోబర్ 7న సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, నాజర్, డా.బ్రహ్మానందం, సునీల్, అలీ, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, సుధ, శ్రీరంజని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.భట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: సత్యరామమూర్తి.


0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates