ముహూర్తాలు, శకునాలూ చూసుకొని యుద్ధరంగంలో దిగడం వీరుడి లక్షణం కాదు. అతనూ అంతే! చేద్దాం, చూద్దాం... అంటూ రేపటికి వాయిదా వేయడం అంటే ఏమిటో తెలియని మనస్తత్వం అతనిది. అనుకొన్నది మరుక్షణం ఆచరణలో పెట్టడమే తెలుసు. శత్రువు బలం, బలగంతో పనిలేదు. ఆయుధం ఉన్నా, లేకున్నా... దూకుడే అతని మంత్రం. అతని తీరు... జోరూ మా సినిమాలో చూడండి అంటున్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు కథానాయకుడు. సమంత నాయిక. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ''మహేష్‌బాబు పాత్రను శ్రీను వైట్ల కొత్త తరహాలో ఆవిష్కరిస్తున్నారు. తమన్ చక్కని స్వరాలు అందించారు. త్వరలోనే పాటల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''ని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
0 comments:
Post a Comment