''దూకుడు చిత్రం ఇన్ని రికార్డులు సాధించటానికి అభిమానులే కారణం. నాన్నను అభిమానించినవాళ్లే నాకు అభిమానులుగా మారటం అదృష్టం'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ సినిమా యాభై రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ''విజయవాడలో నేను రెండోసారి విజయోత్సవాన్ని చేసుకొంటున్నాను. ఇంతమంది ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను. దూకుడు చిత్రంలో నటించడం మంచి అనుభవం. అందరూ తదుపరి సినిమా గురించి అడుగుతున్నారు. అదీ త్వరలోనే మీ ముందుకు వస్తుంద''న్నారు.
కృష్ణ ప్రసంగిస్తూ ''అద్భుతాలను ఎవరూ ముందుగా గుర్తించలేరు. గుర్తించిన తరవాత ఒప్పుకోక తప్పదు. దూకుడు చిత్రం తప్పకుండా ఓ అద్భుతమే. మహేష్ చిన్నతనం నుంచే ప్రతి షాట్‌లో డూప్‌లు లేకుండా నటించటానికి తాపత్రయపడేవాడ''న్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ 'నేను కృష్ణ అభిమానిని. మహేష్‌ను మొదటి నుంచి గమనించేవాడిని. ఆయన ఇమేజ్‌కు సరిపడే కథతోనే సినిమా తీశాను'' అన్నారు. ''నేను ఏ సినిమా అయినా ఒకసారే చూస్తాను. దూకుడు చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మహేష్ అందం, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఎన్టీఆర్ ప్రధానమంత్రి కావాలన్న అందరి ఆశని దర్శకుడు ఈ చిత్రంలో నిజం చేశార''న్నారు విజయనిర్మల. సినిమాలో మహేష్, చిత్ర కథానాయిక సమంత ధరించిన వస్త్రాలను 'మా' ఆధ్వర్యంలో వేలం వేయగా తిరుపతికి చెందిన మధుసూదనరెడ్డి, ప్రిన్స్‌మహేష్.కామ్ రవి వాటిని కొనుగోలు చేశారు. వారికి ఆ దుస్తులను వేదికపై మహేష్, సమంత అందజేశారు. చిత్ర బృందానికీ, పంపిణీదారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, సి.అశ్వనీదత్, సాగర్, సురేష్‌బాబు, డా||కేఎల్ నారాయణ, సమంత, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment