‘సీతమ్మ వాకిట్లో...’ సూపర్‌స్టార్స్

అందరి దృష్టినీ తమవేపు నిలుపుకునే అసలు సిసలైన మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సాక్షిగా ప్రేక్షకుల మనసుల్లో మరుమల్లెలు పూయించడానికి ఇద్దరు అగ్రహీరోలు- వెంకటేష్, మహేష్ రెడీ అయ్యారు. ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన క్రెడిట్ సంచనల చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజుకు దక్కుతుంది.

సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రేక్షకులను ‘కొత్తబంగారులోకం’లో విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అపురూప కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ అన్న పేరును పెట్టి, తొలి అడుగులోనే అభినందనలు అందుకుంటున్నారాయన. ఇద్దరు నాయికలు వుండే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంత నటించనున్నట్టు సమాచారం.

‘దూకుడు’లో మహేష్‌బాబు సరసన చేసిన సమంత ఇందులో రెండోసారి ఆయన సరసన జతకడుతున్నట్టు వినికిడి. ‘దిల్’రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం దసరారోజు అయిన ఈ నెల 6న నిర్వహించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులకు నిజంగా ‘డబుల్ ధమాకా’నే అని చెప్పొచ్చు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates