dookudu dresses for auction

‘‘వరుస పరాజయాలతో డీలా పడ్డ తెలుగు సినిమాకు ఊపిరులూదిన చిత్రం ‘దూకుడు’. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలో కూడా ఒక ప్రభంజనంలా దూసుకుపోతోందీ సినిమా. వసూళ్ల విషయంలో ‘మగధీర’ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. ఎనభై కోట్ల వసూళ్ల అంచనాలు దాటి వంద కోట్ల అంచనాలకు చేరుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా మహేష్ ఇమేజ్‌ని ఏ స్థాయికి తీసుకెళ్లిందంటే... ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా యాభై మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేష్ నిలిచాడు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ చెప్పారు.

‘దూకుడు’ చిత్రంలోని క్లయిమాక్స్ సాంగ్‌లో మహేష్, సమంత ధరించిన దుస్తులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) వేలానికి పెట్టింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘‘గతంలో విజయం సాధించిన కొన్ని సినిమాల్లోని వస్తువులను పేద కళాకారుల సహాయార్థం వేలం వేయడం జరిగింది.

ఇప్పుడు ‘దూకుడు’లో మహేష్, సమంత ధరించిన దుస్తులను వేలం వేస్తున్నాం. ఈ నెల 25 లోగా ఎవరైతే ఎక్కువ ధరకి ఈ దుస్తులను వేలం పాడతారో వారికి మహేష్ చేతులమీదుగా వాటిని అందజేస్తాం’’ అని తెలిపారు. ఇంకా శ్రీనువైట్ల, ‘మా’ సంయుక్త కార్యదర్శి మహర్షి, ‘మా’స్టార్స్ డాట్ కామ్ శేఖర్, మా సభ్యులు జయలక్ష్మి, మాణిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates