Seethamma Vakitlo Sirimalle Chettu

తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్‌ అనేది ఓ కల. ఇద్దరు కథానాయకులు కలిసి తెరమీద సందడి చేస్తే చూడాలని సగటు సినీ అభిమాని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణ ఫలించింది. ఇద్దరు ప్రముఖ కథానాయకులు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రమే... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్‌, మహేష్‌బాబు కథానాయకులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కొత్తబంగారులోకం' చూపించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ఉదయం విజయదశమి పర్వదినాన లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. వి.వి.వినాయక్‌ స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి చేతుల మీదుగా శ్రీకాంత్‌ అడ్డాల స్క్రిప్టు అందుకొన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ''వసుధైక కుటుంబం మన భారతదేశం. ఈ దేశాన్ని సీతమ్మ వాకిలి అనుకొంటే.. అందులో అందమైన సిరిమల్లె చెట్టు మన కుటుంబ వ్యవస్థ. ఈ బంధానికి సంబంధించిన కథ ఇది. అందుకే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే పేరు పెట్టాం. అందరికీ నచ్చిన పేరిది. శ్రీకాంత్‌ ముందునుంచీ 'ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు ఉండాల్సిందే' అని అంటున్నాడు. అది ఎంత కష్టమో మనకు తెలుసు. ఈ కథకు వెంకటేష్‌ ఎప్పుడో తన అంగీకారం తెలిపారు. మరో కథానాయకుడు కావాలి. ఓ రోజు 'దూకుడు' సెట్లో మహేష్‌బాబుకి ఈ కథ వినిపించాం. వెంటనే ఆయన కూడా ఒప్పుకొన్నారు. అలా మా సినిమా మొదలైంది. ఇది ప్రత్యేకించి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తీస్తున్న సినిమా కాదు. ప్రతి ఒక్కరికీ నచ్చేలా తీర్చిదిద్దుతాం. మిగతా నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు ట్వరలోనే చెబుతాం. నవంబరులో చిత్రీకరణ మొదలుపెడతాం. వేసవికి విడుదల చేస్తామ''న్నారు. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, బూరుగుపల్లి శివరామకృష్ణ, శ్యాంప్రసాద్‌రెడ్డి, వంశీపైడిపల్లి తదితరులు పాల్గొన్నారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates