తెలుగు సినిమాకి వసూళ్ల పండగ తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్‌బాబు. 'దూకుడు' సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపారు. ''చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు చాలా సంతృప్తినిస్తోంది. ప్రేక్షకుల ప్రతిస్పందనను ప్రత్యక్షంగా చూడాలనిపిస్తోంది. కానీ 'బిజినెస్ మేన్' చిత్రీకరణ కోసం ముంబై వెళ్లాల్సొచ్చింది. ఇకపై కూడా ఇలాగే అందరూ మెచ్చే సినిమాల్లో నటించాలని ఉంద''ని చెబుతున్న మహేష్‌బాబు ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

ఇంత డబ్బుందా?: ''ఒక నటుడిగా ఎన్నో విషయాలను నేర్పించిందీ చిత్రం. ఏ సినిమాలోనూ ఇంత అందంగా కనిపించలేదని చెబుతుండటం సంతోషాన్నిస్తోంది. నా సినిమాతో పరిశ్రమకు ఇంత పెద్ద విజయం దక్కటం చాలా ఆనందంగా ఉంది. విదేశాల్లో తొలి రెండు రోజుల వసూళ్లు చూసి నాకే ఆశ్చర్యమేసింది. వసూళ్లను చూస్తుంటే మాకే నమ్మశక్యంగా అనిపించలేదు. ఇంత డబ్బు ఎక్కడుందని ఆశ్చర్యమేసింది''.
్రపయోగాలు వద్దు: ''ప్రయోగాలు చేయడం నాకు ఏ మాత్రం ఇష్టముండదు. అందరికీ వినోదాన్ని పంచే మంచి సినిమాలకే నా ప్రాధాన్యం. కౌబాయ్ సినిమాలు చేసే ఆలోచన ఇప్పట్లో ఏ మాత్రం లేదు. ప్రస్తుతం 'బిజినెస్ మేన్' చిత్రీకరణలో బిజీగా ఉన్నాను. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అందులోని పాత్ర గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. ముందుగా అనుకొన్నట్టే జనవరి 12న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది''.
అన్నదమ్ములుగా: ''సంతోష్‌శివన్‌తో సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. హిందీకి వెళ్లే ఆలోచన లేదు. తెలుగులో చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. జనవరి నుంచి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' సెట్స్‌పైకి వెళుతుంది. అందులో వెంకటేష్‌గారితో కలిసి నటిస్తుండటం ఆనందాన్నిస్తోంది. ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. మల్టీస్టారర్ సినిమా అని కాదు కానీ కథ నచ్చింది. అందులో అన్నదమ్ములుగా నటిస్తున్నాం. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం''.
0 comments:
Post a Comment