Dookudu Becoming Industry Biggest Hit

''పోకిరి సినిమా చూశాక 'ఈ సినిమా రూ.40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పా. నేను చెప్పినట్టుగానే ఆ సినిమా బాగా ఆడింది. 'దూకుడు' చూశాక రూ.80 కోట్లు రాబట్టుకొంటుందని చెప్పాను. ఆ సంఖ్య వంద కోట్ల మార్కుకి చేరుకొనేలా ఉంద''న్నారు కృష్ణ. ఆయన తనయుడు మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా బాగా ఆడడానికి చాలా కారణాలున్నాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా తీర్చిదిద్దారు. దర్శకత్వం, సంభాషణలు, పాటలు అన్నీ బాగున్నాయి. థియేటర్‌కి వచ్చినవాళ్లు శుభం కార్డు వరకూ నవ్వుతూనే ఉన్నారు. మహేష్‌ చాలా అందంగా కనిపించాడ''ని చెప్పారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''దూకుడు సినిమా ఈ స్థాయిలో ఆడడానికి కారణం శ్రీను వైట్ల. ఈ కథ చెబుతున్నప్పుడు ఓ మాట అన్నారు.. 'సూపర్‌ హిట్‌ తీస్తా. లేదంటే బ్లాక్‌బస్టర్‌ సినిమా తీస్తా'. అవి రెండూ కాదు.. పరిశ్రమ రికార్డులు తిరగరాసే సినిమా తీశాడు. అతనికి మంచి నిర్మాతలు దొరికారు. సమంతలాంటి కథానాయికని నేనింత వరకూ చూళ్లేదు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకొంటామనే నమ్మకం ఉంద''న్నారు. ''నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. మహేష్‌ అంటే నాకు చాలా ఇష్టం. వీరిద్దరుకలిసి ఇంత మంచి చిత్రం తీయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం విజయానికి మహేష్‌బాబు నటనే కారణం'' అన్నారు దర్శకుడు. ''దమ్మున్న కథానాయకుడు, సత్తా ఉన్న దర్శకుడు కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సినిమానే సాక్ష్యం'' అన్నారు నిర్మాతలు రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట. కథానాయిక సమంత మాట్లాడుతూ ''దూకుడు ద్వారా గొప్ప విజయాన్ని పొందడం నా అదృష్టం. ఈ చిత్రంతో నటిగా కొత్త విషయాలెన్నో తెలుసుకోగలిగాను'' అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల, జి.ఆదిశేషగిరిరావు, డి.సురేష్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ఱ, కె.ఎస్‌.రామారావు, రూప వైట్ల, కోట శ్రీనివాసరావు, తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates