అడుగుజాడల్లో...


'మీ నాన్నగారిలా వేగంగా సినిమాలు తీయరెందుకు..?' - మహేష్‌బాబు ఎప్పుడు ఎదురైనా చాలామంది సంధించే ప్రశ్న ఇదే. అందుకు ఆయన చిరునవ్వే సమాధానం. ఏడాదికి పద్దెనిమిది సినిమాల్లో నటించిన ఘనత ఘట్టమనేని కృష్ణది. మహేష్‌ పదకొండు సంవత్సరాల్లో చేసిన సినిమాల సంఖ్య... 16. నాణ్యత కూడా కావాలనేది మహేష్‌ వాదన. అందులోనూ నిజం కనిపిస్తుంది. 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి'... ఇలాంటి సినిమాలకు రెండేళ్లు తీసుకొన్నా తప్పేం లేదనిపిస్తుంది. కథతోపాటు సాంకేతికాంశాల మీద కూడా శ్రద్ధ పెట్టే కథానాయకుడు మహేష్‌. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది..? అని అడిగితే మళ్లీ కృష్ణ కనిపిస్తారు. స్కోప్‌, కలర్‌, 70ఎమ్‌.ఎమ్‌... ఇలా తెలుగు సినిమా సాంకేతిక హంగులు అద్దుకొన్న ప్రతి దశలోనూ కృష్ణ అడుగులు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే.. మహేష్‌ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు. ఇక దూకుడే!
'అతిథి', 'ఖలేజా' సినిమాలు మహేష్‌ అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. వాళ్లెప్పుడూ 'పోకిరి' అంచనాలతోనే థియేటర్లకు వస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొన్న మహేష్‌ మరోసారి పోకిరి ఫార్ములానే నమ్ముకొన్నారు. ఆ సినిమానే 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మహేష్‌తో సమంత జోడీ కట్టింది. 'ఖలేజా'తో పోలిస్తే 'దూకుడు'... వేగంగానే సిద్ధమైంది. చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ నెల 13న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌తో 'ది బిజినెస్‌మేన్‌' త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించేందుకు మహేష్‌ ఒప్పుకొన్నారు. సుకుమార్‌ కూడా మహేష్‌ కోసం ఓ కథ సిద్ధం చేసుకొంటున్నారు. మంగళవారం మహేష్‌బాబు జన్మదినం. ఆడంబరాలకు దూరంగా పుట్టిన రోజు జరుపుకోవాలనుకొంటున్నారు మహేష్‌.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates