శ్రీను వైట్ల మాటల్లో మహేష్‌బాబు

సాధారణంగా ప్రతి సినిమాలో కథానాయకుడు ఒక్కడే ఉంటాడు. కథంతా అతని చుట్టే తిరుగుతుంది కాబట్టి... థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడి దృష్టి అతని మీదే ఉంటుంది. శ్రీను వైట్ల సినిమాలకు వెళ్లేటప్పుడు ఈ అభిప్రాయాన్ని చెరిపేసుకోవచ్చు. ఎందుకంటే... సన్నివేశం ఓ హీరోలా కనిపిస్తుంది. అందులో కనిపించే ప్రతీ పాత్రా వినోదం పండించడానికి పోటీపడుతుంది. ఓ వైపు కథానాయకుడు ఆటాడించేస్తూనే ఉంటాడు. ఎక్కడా మాస్‌, యాక్షన్‌ తగ్గనీయడు. మరో వైపు మెక్‌డొనాల్డ్‌ మూర్తో, చికాగో సుబ్బారావో, బొక్కా వెంకట్రావో... చక్కిలిగింతలు పెట్టేస్తుంటాడు. తాజాగా మహేష్‌బాబు 'దూకుడు'ని తన శైలిలో చూపించి వినోదం పంచారు శ్రీను వైట్ల. ఈ సందర్భంగా ఆయనతో ఈనాడు సినిమా ప్రత్యేకంగా సంభాషించింది.

'దూకుడు' ఫలితం ఎలాంటి అనుభూతినిచ్చింది?
'దూకుడు' విడుదలైన మరునాడే నా పుట్టిన రోజు. ఘన విజయంతో తెలుగు ప్రేక్షకులు నాకు మరచిపోలేని బహుమతిని అందించారు. మూడు రోజుల్లోనే వసూళ్లపరంగా ఎన్నో రికార్డులు సాధించింది 'దూకుడు'. విదేశాల్లోనూ చక్కటి ఆదరణ పొందుతోంది. తరణ్‌ ఆదర్శ్‌లాంటి బాలీవుడ్‌ మార్కెట్‌ విశ్లేషకులు సైతం 'దూకుడు' హిందీ సినిమాలతో పోటీపడి విదేశాల్లో వసూళ్లు దక్కించుకొందని ట్విట్టర్‌లో రాశారు. ఇంతటి విజయాన్ని సాధించడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది.
మహేష్‌బాబుతో సినిమా అనగానే మీకేమనిపించింది?
చాలా రోజులుగా మహేష్‌బాబుతో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నా. ఆ అవకాశం నాకు దొరికింది. ఎలాగైనా ఒక మంచి సినిమా తియ్యాలని మనసులో బలంగా అనుకొన్నాను. మహేష్‌కి నేను అనుకొన్న ఓ కథ చెప్పాను. ఆయన బాగుందనీ అన్నారు. ఎనభై శాతం స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేశాం. ఇక షూటింగ్‌కి వెళ్లడమే ఆలస్యం అనుకొన్న తరుణంలో ఓ రోజు రాత్రి ఈ కథను మార్చాలని అనిపించింది నాకు. మహేష్‌తో ఘన విజయం ఇచ్చే కథ ఇలా ఉండకూడదనే భావన కలిగింది. ఇంకో మంచి కథ తీసుకొస్తానని మహేష్‌కి చెప్పి వచ్చాను. కానీ... ఏం చేయాలీ? ఎలాంటి కథ చేయాలీ అనే ఒత్తిడి మొదలైంది. ఎలాగైనా మహేష్‌ని కొత్తగా చూపించాలని తీవ్రంగా ఆలోచించా. అప్పుడు తట్టిన ఆలోచనే యువ ఎమ్మెల్యే పాత్ర. అక్కడ మొదలుపెట్టి అల్లుకొన్న కథే ఇది.
ఐపీఎస్‌ పాత్రకు, ఎమ్మెల్యేకీ ముడి వేసేశారు..?
ఈ ఆలోచనతోపాటు తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, భావోద్వేగాల గురించి మా రచయిత గోపీమోహన్‌కి చెప్పాను. చాలా బాగుందని చెప్పాడు తను. ఏడు నెలలు అహర్నిశలు కష్టపడి ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. ఈ కథ విన్నాక మహేష్‌బాబు 'ఫెంటాస్టిక్‌, మైండ్‌ బ్లోయింగ్‌, అన్‌బిలీవబుల్‌' అనేశారు. ఆ మాటల్నే ఈ సినిమాలో వాడుకొన్నాం. కోన వెంకట్‌ సంభాషణలు, గుహన్‌ ఛాయాగ్రహణం, తమన్‌ సంగీతం మాకు కలిసొచ్చాయి. నిర్మాతలు నా మిత్రులు కావడంతో ఎంతో సహకరించారు.
మహేష్‌బాబు ఒక మాస్‌ కథానాయకుడు. వినోదానికి ప్రాధాన్యమిచ్చే దర్శకులు మీరు. ఈ కథ అనుకొన్నప్పుడు ఇద్దరి శైలికీ వ్యత్యాసముందని అనిపించలేదా?
కొన్నేళ్లుగా మహేష్‌బాబు శైలిని ప్రత్యేకంగా గమనిస్తున్నాను. తెరపై వినోదాన్ని పండించడంలో ఆయన సత్తా ఏమిటో నాకు తెలుసు. పైగా ఈ కథలో హీరో పాత్ర పలు కోణాల్లో కనిపిస్తుంది. ఇది వరకు ఎవ్వరూ కూడా మహేష్‌ని అన్ని కోణాల్లో చూపించకపోవటం మాకు కలిసొచ్చింది. అన్ని విషయాలు సమపాళ్లల్లో కుదరటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకెళ్లాం. మా ప్రయత్నం చక్కటి ఫలితాన్నివ్వటం ఆనందాన్నిస్తోంది.
ఈ సినిమాలో భావోద్వేగాల పాళ్లు కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి...
తెలుగులో గొప్ప విజయాన్ని సాధించిన సినిమాలను తీసుకొంటే అందులో వినోదం, భావోద్వేగాలు, ఉత్కంఠ.. ఈ మూడు సమపాళ్లల్లో ఉంటాయి. అప్పుడే మన ప్రేక్షకులకు చేరువవుతుంది సినిమా. అందుకే నవరసాల్లో నేను కరుణ రసానికీ తగిన ప్రాధాన్యమిస్తాను. నా సినిమాలు పరిశీలిస్తే కుటుంబ వాతావరణం తప్పకుండా ఉంటుంది. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథ కాబట్టే 'దూకుడు' సెంటిమెంట్‌ కూడా బాగా పండింది.
నటుడిగా కాదు... వ్యక్తిగతంగా మహేష్‌బాబుపై మీ అభిప్రాయం ఏమిటి?
ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. కానీ మహేష్‌ విషయంలో అది విరుద్ధంగా జరుగుతోంది. ఆయన అలా ఉండటానికి ఓ కారణం ఉంది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటారాయన. ఆయన నవ్వడానికి ఒక చిన్న కారణం కావాలంతే. మహేష్‌ అందం మాకు కొన్ని సంభాషణలు రాసుకొనేందుకూ పనికొచ్చింది.
తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిపై సర్వహక్కులు కథానాయకుడికే ఉంటాయి. కానీ ఈ సినిమా పతాక సన్నివేశాలను అందుకు భిన్నంగా చూపించడానికి కారణమేమిటి?
ఈ కథ ప్రత్యేకతే అది. 'దూకుడు' విజయానికి ప్రధానమైన ఓ కారణం కూడా పతాక సన్నివేశాలే. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పతాక సన్నివేశాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా కూడా రక్తపాతంతో కూడిన సన్నివేశాలు లేకపోవటంతో అన్ని వయసుల ప్రేక్షకులు ఆనందంగా చూస్తున్నారు.
మీ సినిమాలంటే తెర నిండా పాత్రలు, అడుగడుగునా మలుపులు తప్పనిసరిగా ఉండాల్సిందేనా?
నిజం చెప్పాలంటే... నాలుగైదు పాత్రలతో నేను సినిమా తియ్యలేను. సెట్‌కి వెళితే నాకు సందడి కనిపించాలి. మొదట్నుంచీ అలాగే అలవాటైంది. అయితే ఈ తరహా కథలను తెరపైకి తీసుకురావటంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం తూకం చెడినా ఫలితాలు మారిపోతాయి. ఇది కష్టమైన పనైనా నేను చాలా ఇష్టంగా చేస్తుంటాను.
రెఢీ, ఢీ... మీ సినిమాలు హిందీలోకి వెళ్తున్నాయి. మీరూ హిందీకి వెళ్లే ఆలోచనేమైనా ఉందా?
నా చిత్రాలు బాలీవుడ్‌కి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. హిందీలో టాప్‌ త్రీ సినిమాల్లో 'రెడీ' ఒకటిగా నిలిచింది. 'ఢీ' సినిమాకి దర్శకత్వం వహించమని అడిగారు. కానీ నాకు తీరిక లేకపోవటంతో ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు 'దూకుడు' సినిమాని హిందీలో తీయాలనే ఆలోచన ఉంది. సల్మాన్‌ఖాన్‌ అయితే దీనికి బాగుంటాడని అనుకొంటున్నా. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి.
తదుపరి చిత్రం ఎప్పుడు?
ప్రస్తుతం దూకుడు విజయానందంలో ఉన్నాను. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సినిమా ఉంటుంది. అలాగే వచ్చే యేడాది మహేష్‌బాబుతో మరో చిత్రం చేస్తాను.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates